ఐదో వ‌న్డేలో మార్పులున్నాయా?

దిల్లీ: ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారీ స్కోర్‌ సాధించినప్పటికీ టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించి జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేసింది. ఈ నేపథ్యంలో రాంచీతో మ్యాచ్‌ అనంతరం వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్‌పంత్‌కు చోటిచ్చారు. మొహాలీ వన్డేలో పంత్‌ బ్యాట్‌తో ఫర్వాలేదనిపించినా కీపింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. మూడు సార్లు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్లు చేసే అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఈ సందర్భంగా మ్యాచ్‌ జరగుతుండగానే కెప్టెన్‌ కోహ్లీ తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే. కాగా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదన్నాడు. ఏదేమైనా నాలుగో వన్డేలో పంత్‌ తప్పిదాలకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పంత్‌ను విమర్శిస్తూ అభిమానులు తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు. మొహాలీలో ఆసీస్‌ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక దిల్లీలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రపంచకప్‌ ముందు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. 

ఐదో వన్డేకు టీమిండియాలో వీరికి స్థానం లభించవచ్చు..

శిఖర్‌ధావన్‌: ఆరు నెలలుగా పేలవమైన ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధావన్‌ ఎట్టకేలకు శతకంతో మెరిపించాడు. మొహాలీ వన్డేలో భారీ ఇన్నింగ్స్‌ ఆడి టీమిండియాకి విలువైన పరుగులు అందించాడు.
రోహిత్‌: ఇటీవల రోహిత్‌ శర్మ సైతం తన స్థాయికి తగ్గ పరుగులు చేయక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. గత మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ చూస్తే రోహిత్‌ గాడిలో పడినట్లు కనిపిస్తోంది.
విరాట్‌కోహ్లీ: ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ గత మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇదొక్క మ్యాచ్‌లో తప్ప విరాట్‌ మిగతా మ్యాచుల్లో బాగానే రాణించాడు.
కేఎల్‌ రాహుల్‌: అంబటిరాయుడు స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన రాహుల్‌ మొహాలీ వన్డేలో ఓ మాదిరిగా రాణించాడు. ఇక ఐదో వన్డేలోనూ అతడికి స్థానం కల్పించి ప్రపంచకప్‌ ముందు పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. 
రిషభ్‌ పంత్‌: నాలుగో వన్డేలో వికెట్ల వెనుక విఫలమైనా బ్యాట్‌తో మెరిపించాడు.  ఇప్పటికే ధోనీకి విశ్రాంతినివ్వడంతో మరోసారి వికెట్‌కీపర్‌గా తుదిపోరులో ఉండే అవకాం కనిపిస్తోంది. 
కేదార్‌జాదవ్‌: రెండో వన్డేలో ధోనీతో కలిసి మ్యాచ్‌ను గెలిపించిన జాదవ్‌ మొహాలీలో మెరిపించలేకపోయాడు. ఇక బౌలింగ్‌లోనూ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. జాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అధిక పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్‌ మినహా జాదవ్‌ ఆల్‌రౌండర్‌గా బాగానే రాణిస్తున్నాడు.
విజయ్‌శంకర్‌: మొహాలీ వన్డేలో 15 బంతుల్లో 26 పరుగులు చేసిన శంకర్‌ క్రీజులో ఉన్న కొద్ది సేపు బ్యాటుతో అలరించాడు. అలాగే బౌలింగ్‌లో వికెట్లేమీ తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. దీంతో ఐదు ఓవర్లకు 29 పరుగులే ఇచ్చి తన ప్రత్యేకత చాటుకన్నాడు.
రవీంద్ర జడేజా: మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ విజయ్‌శంకర్‌ లేదా యజువేంద్ర చాహల్‌ ఇద్దరిలో ఎవరిని తప్పించినా ఐదో వన్డేలో జడేజాకు ఆడే అవకాశం రానుంది.
భువనేశ్వర్‌ కుమార్‌: మొహాలీలో అంతగా రాణించకపోయినా సీనియర్‌ పేస్‌ బౌలర్‌గా భువనేశ్వర్‌ జట్టులో కొనసాగేలా ఉన్నాడు. ఐదో వన్డేలోనైనా ఆసీస్‌ వికెట్లు తీసి భువనేశ్వర్‌ మెరుస్తాడనే జట్టు యాజమాన్యం భావిస్తోంది.
కుల్‌దీప్‌ యాదవ్‌: చైనామెన్‌ బౌలర్‌ నాలుగో వన్డేలో ఆసీస్‌ కీలక బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌మాక్స్‌వెల్‌ వికెట్‌ తీసి ఆకట్టుకున్నాడు. మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించి వికెట్లు తీయడానికి కుల్‌దీప్‌ పనికొస్తాడని జట్టు భావిస్తోంది.
జస్ప్రిత్‌ బుమ్రా: టీమిండియా ప్రధాన బౌలర్‌గా పేరొందిన బుమ్రా గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. అయినప్పటికీ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ బుమ్రా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని అధిక పరుగులు రాబట్టారు. దీంతో దిల్లీ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది.