రిషభ్ పంత్‌కు అండగా సునిల్‌ శెట్టి

హైదరాబాద్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు మద్దతు పెరుగుతోంది. అతడిని అనవసరంగా విమర్శించొద్దని మాజీ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు సునిల్‌శెట్టి ఈ యువ ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో పంత్‌ కీపింగ్‌లో కొన్ని పొరపాట్లు చేశాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్‌ చేసే అవకాశాలను వృథా చేశాడు. అదనపు పరుగులూ ఇచ్చాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ ధోనీని అనుసరించబోయి విఫలమయ్యాడు. దీంతో మైదానంలో కొందరు వీక్షకులు ‘ధోనీని తిరిగి తీసుకురండి’ అని నినాదాలు చేశారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత సోషల్‌ మీడియాలో పంత్‌ను శ్రుతిమించి ట్రోలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పంత్‌కు సునిల్‌ శెట్టి అండగా నిలిచాడు.