విరాట్‌ భాయ్‌ ధోనీకో బులావో

మొహాలి: భారత్‌-ఆసీస్‌ మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం మొత్తం ధోనీ పేరుతో మార్మోగిపోయింది. అందుకు సంబంధించి వీడియోలు మ్యాచ్‌ అనంతరం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ప్రత్యేకంగా వికెట్ల వెనుక రిషబ్‌పంత్‌ వైఫల్యాన్ని ఉద్ధేశిస్తూ నెటిజెన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధోనీ స్థానంలో కీపింగ్‌ చేసిన రిషబ్‌పంత్‌ రెండు మూడు సార్లు తేలికైన స్టంపౌట్లను జారవిడిచాడు. కీలక సమయంలో పంత్‌ చేసిన తప్పిదాల కారణంగా భారత్‌ మూల్యం చెల్లించుకుంది. 

అయితే వికెట్ల వెనుక పంత్‌ విఫలమైన ప్రతిసారీ స్టేడియంలోని అభిమానులు ధోనీ.. ధోనీ అంటూ నినదించారు. ఆ వీడియోలు సైతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విరాట్‌ కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా ఓ అభిమాని గట్టిగా అరుస్తూ.. ‘విరాట్‌ భాయ్‌ ధోనీ కో బులావో’ అంటూ అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ముఖ్యంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 44వ ఓవర్లో చాహల్‌ బౌలింగ్‌ చేస్తుండగా ప్రమాదకర టర్నర్‌ క్రీజు నుంచి కాస్త ముందుకు వెళ్లాడు. బంతి వైడ్‌గా వెళ్లడంతో పంత్‌ దాన్ని అందుకోలేకపోయాడు. ప్రమాదకరంగా ఉన్న టర్నర్‌ను ఔట్‌ చేసే మంచి అవకాశం చేజారింది. అప్పటికి అతడు 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశం తర్వాత టర్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో 16 బంతుల్లో 46 పరుగులు చేసి 13 బంతులు మిగిలుండగానే ఆసీస్‌కు విజయాన్నందించాడు. అలాగే మరోసారి కారేను స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని సైతం పంత్‌ చేజార్చుకున్నాడు. ధోనీ మాదిరి వికెట్లని చూడకుండా బంతిని విసరడం ద్వారా ఆ అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. దీంతో స్టేడియం మొత్తం ధోనీ.. ధోనీ అని నినదించారు.