దోచిపెట్టింది నిజమే

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అత్యంత విలువైన 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వడంద్వారా అప్పటి వైఎస్‌ ప్రభుత్వం హిందూజా గ్రూప్‌నకు చెందిన గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు (జీవోసీఎల్‌) అనుచిత లబ్ధి చేకూర్చిందని, ప్రతిగా ‘నాకది- నీకిది (క్విడ్‌ ప్రో కో)’ విధానంలో వైఎస్‌ కుమారుడు జగన్‌కు 11.10 ఎకరాల భూమిని హిందూజా గ్రూప్‌ లంచంగా కట్టబెట్టిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. ఈ కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సమర్పించిన మెమోలో కొన్ని వాస్తవ విరుద్ధ అంశాలున్నాయని, వాటిని సవరించి మళ్లీ మెమో దాఖలు చేయాలని రెండేళ్ల కిందటే స్పష్టం చేసింది. జగన్‌ కేసులను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ డైరెక్టరు కర్నల్‌సింగ్‌ 2017 మే 31న సీబీఐ డైరెక్టరు ఆలోక్‌వర్మకు లేఖ రాశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన లోపాల్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.

వైఎస్‌ ప్రభుత్వ హయాంలో జగన్‌, ‘ఇందు’ గ్రూప్‌ సంస్థల అధినేత ఐ.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్విడ్‌ ప్రో కో విధానంలో ఏ విధంగా లబ్ధి పొందిందీ వివరించారు. సీబీఐ దాఖలు చేసిన 5 ఛార్జిషీట్లలో పేరు నమోదైన జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ క్విడ్‌ ప్రో కో విధానంలో ఎలాంటి లబ్ధి పొందలేదని కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కేసుల్లో మరింత లోతైన దర్యాప్తు జరపాలని, సీబీఐ కోర్టుకు సవరించిన మెమో సమర్పించాలని సూచించారు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ మంగళవారం బయటపెట్టింది. ఈడీ డైరెక్టరు రెండేళ్ల క్రితమే లేఖ రాసినా... సీబీఐ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్‌ కుమ్మక్కవడమే కారణమని, పీకల్లోతు అక్రమాస్తుల కేసుల్లో కూరుకుపోయిన జగన్‌ను మోదీ రక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెదేపా ధ్వజమెత్తింది.

ఇదీ కాజేసిన తీరు...
హిందూజా సంస్థకు అనుచిత లబ్ధి వ్యవహారంలో క్విడ్‌ ప్రో కో ఎలా జరిగిందో ఈడీ డైరెక్టరు పూసగుచ్చినట్లు వివరించారు.
* హిందూజా గ్రూప్‌నకు చెందిన జీవోసీఎల్‌కు కూకట్‌పల్లిలో డిటొనేటర్‌ తయారీ పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమకు చెందిన 100 ఎకరాల్లో టెక్నాలజీ పార్కును అభివృద్ధి చేస్తామని, భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వాలని 2005 మార్చి 8న అప్పటి వైఎస్‌ ప్రభుత్వాన్ని జీవోసీఎల్‌ కోరింది. అప్పటి నుంచీ ప్రభుత్వానికీ ఆ సంస్థకూ మధ్య పలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి.
* భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వాలంటే జగన్‌కు చెందిన బినామీ సంస్థ యాగా అసోసియేట్స్‌కు 11.10 ఎకరాలు లంచంగా ఇవ్వాలన్న ఒప్పందం జరిగింది. ఇందులో ఇందూ గ్రూప్‌ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి కీలక భూమిక నిర్వహించారు.
* ఒప్పందం తర్వాత యాగా అసోసియేట్స్‌కు 11.10 ఎకరాల భూమిని విక్రయం పేరుతో కట్టబెట్టేందుకు బోర్డు సమావేశంలో జీవోసీఎల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో 2009 ఫిబ్రవరి 26న 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* ఒప్పందం ప్రకారం యాగా అసోసియేట్స్‌కు 11.10 ఎకరాల్ని ఎకరం రూ.4.18 కోట్ల చొప్పున రూ.46.40 కోట్లకు విక్రయించినట్లు రికార్డుల్లో చూపించింది. కానీ ఆ భూమి కోసం యాగా అసోసియేట్స్‌ ఒక్క పైసా చెల్లించలేదు. ఆ డబ్బును హిందూజా సంస్థే ఒక చేత్తో యాగా అసోసియేట్స్‌కు ఇచ్చి మరో చేత్తో తీసుకుంది.
* ఈ డబ్బు అక్రమ లావాదేవీలకు ఇందూ ప్రాజెక్ట్స్‌ను, కోల్‌కతాలోని డొల్ల కంపెనీలను వాడుకున్నారు.
* మొదట తమ ప్రాజెక్టు భూమి అభివృద్ధి, కన్సల్టెన్సీ సేవలందిస్తున్నారన్న పేరుతో ఇందూ ప్రాజెక్ట్స్‌కు 2009 జనవరి- మార్చి మధ్య జీవోసీఎల్‌ సంస్థ రూ.49 కోట్లను బదలాయించింది.
* రెండో అంచెలో ఆ డబ్బులో రూ.48.48 కోట్లను ఇందూ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ 2009 మార్చి- ఏప్రిల్‌ మధ్య కోల్‌కతాలోని రెండు షెల్‌ కంపెనీలకు బదలాయించింది.
* మూడో అంచెలో ఆ రెండు షెల్‌ కంపెనీలు సహా, కోల్‌కతాలోని 25 షెల్‌ కంపెనీలు రూ.47 కోట్లను యాగా అసోసియేట్స్‌కు బదిలీ చేశాయి.
* నాలుగో అంచెలో షెల్‌ కంపెనీల నుంచి వచ్చిన డబ్బులో రూ.46.40 కోట్లను యాగా అసోసియేట్స్‌ సంస్థ జీవోసీఎల్‌కు చెల్లించింది.
* తద్వారా ప్రభుత్వం తమకు చేకూర్చిన అనుచిత లబ్ధికిగానూ క్విడ్‌ ప్రో కో కింద జీవోసీఎల్‌ సంస్థ తన డబ్బే జగన్‌ సంస్థకు ఇచ్చి భూమిని జగన్‌ సంస్థకు అమ్మినట్లు చూపి ఆ డబ్బునే తిరిగి తీసుకుంది.
* ఆ 11.10 ఎకరాల ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.177.60 కోట్లు ఉంటుందని ఈడీ డైరెక్టరు తన లేఖలో ప్రస్తావించారు.
* యాగా అసోసియేట్స్‌ ఏర్పాటు వెనుక సూత్రధారి వైకాపా నేత విజయసాయిరెడ్డి అని ఈడీ డైరెక్టరు లేఖను బట్టి వెల్లడవుతోంది.
* యాగా అసోసియేట్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న అడ్రస్‌ బెంగళూరులోని విజయసాయిరెడ్డి నివాసం అడ్రస్‌ ఒకటే. ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డి దగ్గర పని చేసిన ఉద్యోగి కె.ఆర్‌.శ్రీనాథ్‌ పేరుతో ఆ కంపెనీని ప్రారంభించారు. తర్వాత ఆయన నుంచి కొనుగోలు చేసినట్లు చూపించి తన అనుచరులైన వేద శివరాజు, ముఖేష్‌ గైక్వాడ్‌లకు ఆ కంపెనీని విజయసాయిరెడ్డి అప్పగించారు.
* క్విడ్‌ ప్రో కో విధానంలో లంచం తీసుకుని కూకట్‌పల్లిలోని అత్యంత విలువైన 100 ఎకరాల భూ వినియోగ మార్పిడికి అనుమతివ్వడంతోపాటు విశాఖ జిల్లాలోని పెదగంట్యాడలో హిందుజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌కు చెందిన 1040 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణకు వైఎస్‌ ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఈ అంశాలపై సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఈడీ డైరెక్టరు తన లేఖలో స్పష్టం చేశారు.

ఛార్జిషీటులో ఉన్న పేర్లు...   మెమోలో ఎందుకు లేవు
జగన్‌ అక్రమాస్తుల కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ 11 ఛార్జిషీట్లు నమోదు చేసిందని, ఎఫ్‌ఐఆర్‌లో 73 సంస్థలు/వ్యక్తుల పేర్లుండగా ఛార్జిషీట్లలో 28 సంస్థలు/ వ్యక్తుల పేర్లనే ప్రస్తావించిందని ఈడీ డైరెక్టరు పేర్కొన్నారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సండూర్‌ పవర్‌, కార్మెల్‌ ఏసియా, పీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌, జూబిలీ మీడియా కమ్యూనికేషన్స్‌, క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌, ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సరస్వతి పవర్‌, మంత్రి డెవలపర్స్‌ సంస్థలు క్విడ్‌ ప్రో కోకి పాల్పడినట్లు ఆధారాల్లేవని కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. క్విడ్‌ ప్రో కో విధానంలో పెట్టుబడులు పొందిన కేసులకు సంబంధించి అదే సీబీఐ కోర్టులో... సీబీఐ దాఖలు చేసిన 5 ఛార్జిషీట్లలో కార్మెల్‌ ఏసియా నిందితురాలిగా ఉందన్నారు. సీబీఐ మెమో వాస్తవాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మెమో ఈడీ దర్యాప్తునకు అవరోధంగా మారుతోందని పేర్కొన్నారు. సీబీఐ మెమో ఆధారంగా తమపై ఎలాంటి క్విడ్‌ ప్రో కో కేసులు లేవంటూ ఆ సంస్థలు పీఎంఎల్‌ఏ విచారణ ప్రాధికార సంస్థ/ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌/ కోర్టుల్లో వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన సవరణలతో సీబీఐ కోర్టులో మరో మెమో దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టరుకు ఈడీ డైరెక్టరు స్పష్టం చేశారు.

మోదీతో జగన్‌ కుమ్మక్కుకు నిదర్శనం: తెదేపా
జగన్‌ కేసులను పునఃపరిశీలించాలని సీబీఐ డైరెక్టరుకు  ఈడీ డైరెక్టరు లేఖ రాసి రెండేళ్లైనా సీబీఐ  స్పందించకపోవడానికి కారణం మోదీ సర్కారుతో జగన్‌ ఒప్పందం చేసుకోవడమేనని తెదేపా ధ్వజమెత్తింది. పలు అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉండి, క్విడ్‌ ప్రో కోలో అన్నీ తానై నడిపించిన విజయసాయిరెడ్డి ప్రధానితో మాట్లాడి  ఒప్పందం చేసుకున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ‘విజయసాయిరెడ్డి తరచూ ప్రధాని కార్యాలయంలో కనిపించేవారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,  విభజన హామీల సాధన కోసం కేంద్రంతో పోరాటం చేయకుండా వైకాపా తప్పించుకు తిరిగే ధోరణి అవలంభించింది. జగన్‌పై కేసులను నీరుగార్చే ఒప్పందంలో భాగంగానే  ఇవన్నీ జరుగుతున్నాయని ఈ లేఖ బయటకు రావడంతో స్పష్టమైంది’ అని మండిపడింది.

ఇందూకీ అక్రమ కేటాయింపులే..

గన్‌కు అత్యంత సన్నిహితుడు, జీవోసీఎల్‌- యాగా అసోసియేట్స్‌ క్విడ్‌ ప్రో కో వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డి భాగస్వామిగా ఉన్న కంపెనీకి వైఎస్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 6.45 ఎకరాల్ని ఐటీ విధానం కింద కట్టబెట్టిందని, ఇందులోనూ పలు అక్రమాలు జరిగాయని ఈడీ డైరెక్టరు తన లేఖలో ప్రస్తావించారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందు టెక్‌ జోన్‌, ఇందు ప్రాజెక్ట్స్‌- ఏపీ హౌసింగ్‌ బోర్డు కేసుల్లోనూ శ్యాంప్రసాద్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, జగన్‌ కంపెనీల్లో ఆయన క్విడ్‌ ప్రో కో విధానంలో రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు అభియోగాలు నమోదు చేసిందని గుర్తు చేశారు.
* వైఎస్‌ ప్రభుత్వ హయాంలో... శ్యాంప్రసాద్‌రెడ్డి భాగస్వామిగా ఉన్న ‘మాక్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థకు ఎలాంటి అర్హతలూ లేకుండానే రంగారెడ్డి జిల్లాలోని నానక్‌రామ్‌గూడలో వివిధ దశల్లో 6.45 ఎకరాల్ని ఐటీ విధానం కింద ఏపీఐఐసీ కేటాయించింది.
* మాక్‌ సొల్యూషన్స్‌ సంస్థ 2005 డిసెంబరు 21న రిజిస్టరు కాగా... 2005 నవంబరులోనే తొలి దశలో 2.25 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. అంటే రిజిస్టరు కాని సంస్థకు ముందే భూ కేటాయింపులు జరిపారు.
* వివిధ దశల్లో 5.795 ఎకరాలు పొందిన మాక్‌ సొల్యూషన్స్‌ సంస్థ... తర్వాత ఆ భూమిని మాక్‌ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించేందుకు అనుమతి కోరగా ఏపీఐఐసీ అనుమతిచ్చింది.
* మాక్‌ సొల్యూషన్స్‌ సంస్థ... మాక్‌ సాఫ్ట్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తమకున్న రూ.10 ముఖ విలువ కలిగిన 10వేల షేర్లను రూ.104.10 కోట్లకు ఐర్లాండ్‌కు చెందిన క్విన్‌ లాజిస్టిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (క్విన్‌ గ్రూప్‌, ఐర్లాండ్‌) విక్రయించింది.
* ఒక భాగస్వామ్య సంస్థ తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు విక్రయించడం, అందులోని తన షేర్లను విక్రయించడం ఐటీ పాలసీకి విరుద్ధం.
* ఈ లావాదేవీ ద్వారా శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.100 కోట్లు లబ్ధి పొందారన్నది అభియోగం.
* ఆ తర్వాత 5.795 ఎకరాల్లో ‘క్యు-సిటీ బిల్డింగ్‌’ నిర్మాణానికి ఇందూ గ్రూప్‌ సంస్థ... క్విన్‌ గ్రూప్‌ నుంచి రూ.180 కోట్లు తీసుకుంది.
* తర్వాత ప్రభుత్వం... మాక్‌ సొల్యూషన్స్‌కు మరో 0.475 ఎకరాల్ని కేటాయించింది.
* శ్యాంప్రసాద్‌రెడ్డికి జగన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని సీబీఐకి రాసిన లేఖలో ఈడీ డైరెక్టరు ప్రస్తావించారు. మాక్‌ సొల్యూషన్స్‌కు 6.45 ఎకరాల్ని కేటాయించడంద్వారా ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందని తెలిపారు. దీనికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీల ద్వారా జగన్‌ సంస్థల్లో శ్యాంప్రసాద్‌రెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాల్లో ఇతర రూపాల్లోనూ లంచాలు ఇచ్చారేమో నిగ్గు తేల్చాల్సి ఉందని, సీబీఐ మరింత లోతైన దర్యాప్తు జరపాలని ఈడీ డైరెక్టరు సూచించారు.