‘చిత్రలహరి’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘చిత్రలహరి... అప్పట్లో దూర్‌దర్శన్‌లో ప్రతీ శుక్రవారం వచ్చే ఓ ప్రోగ్రామ్‌. ఈ ‘చిత్రలహరి’ 2019లో ఓ శుక్రవారం విడుదలయ్యే సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ ధరమ్‌తేజ్‌ చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందులో నివేదా పేతురాజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలుగా నటించారు. ‘మగాళ్లంతా సేమ్‌. మనల్ని రీచ్‌ అయ్యేంతవరకు ఒకలా ఉంటారు. రీచయ్యాక.. అంతా ఒకేలా ఉంటారు’ అని నివేదా సీరియస్‌గా చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కమెడియన్‌, హీరో సునీల్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. సినిమాలో ఒక్కో పాత్రవి ఒక్కోరకమైన కష్టాలు. అసలు వారి కష్టాలేంటో తెలియాలంటే ఏప్రిల్‌ 12వరకు వేచిచూడాల్సిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.