‘సారు.. కారు.. పదహారు.. దిల్లీలో సర్కారు’

హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌  సిఫారసు చేసినా మోదీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భాజపా పాలిత రాష్ట్రం మహారాష్ట్ర అడగకపోయినా మెట్రో రైలు నిర్మాణానికి రూ.17వేల కోట్లు అప్పనంగా ఇచ్చారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ కేంద్రంలో ఈసారి ఏకపక్ష ప్రభుత్వం వచ్చే పరిస్థితిలేదు. దేశాన్ని మోదీ ఉద్ధరిస్తారనే అభిప్రాయంతో గత ఎన్నికల్లో 283 సీట్లు ఇచ్చి ఏకపక్ష మెజార్టీ కట్టబెట్టారు. మోదీ గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతుంది. ఆయన ప్రతిష్ఠ మసకబారుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 150-160 సీట్లకు మించి వచ్చే పరిస్థితిలేదు. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ కూడా ఏమీ పెరిగిపోలేదు. గతంలో కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ పార్టీకి 100 సీట్లు వచ్చినా ఏమీ చేసే పరిస్థితి లేదు. భాజపా, కాంగ్రెస్‌ కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందువల్ల సమయం చూసి దెబ్బకొట్టాలి. తెలంగాణలో గెలిచే ఒక్కో ఎంపీ దిల్లీలో చాలా కీలకం కాబోతున్నారు.  సారు.. కారు.. పదహారు.. దిల్లీలో సర్కారు.. ఇదే నినాదంతో మనం ప్రజల్లోకి పోదాం. మొత్తం 17 స్థానాలకు గాను తెరాస నుంచి 16 మందిని, మిత్రపక్షమైన ఎంఐఎం నుంచి ఒకరిని గెలిపించుకోవాలి. కాంగ్రెస్‌, భాజపా అంటే గిట్టని వారు దేశంలో ఎందరో ఉన్నారు. మనం దిల్లీ చుట్టూ తిరగడం కాదు.. దిల్లీ వాళ్లే హైదరాబాద్‌ చుట్టూ తిరిగే  పరిస్థితులు రావాలి. నీతి ఆయోగ్‌ చెప్పిన రూ. 24వేల కోట్లు తెలంగాణకు రావాలి. బుల్లెట్‌ రైలు రావాలి. కాళేశ్వరం, పాలమూరులలో ఏదోఒకదాన్ని జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని మోదీని కోరితే ఇప్పటివరకు స్పందనలేదు. దిల్లీ జుట్టు మనచేతిలో ఉండాలి. వచ్చే ఐదేళ్లలో దిల్లీ నుంచి అదనంగా నిధులు రావాలంటే అక్కడ మనం మద్దతిచ్చే వాళ్లు ఉండాలి. కాంగ్రెస్‌ వాళ్లను గెలిపిస్తే ఏమీకాదు. వారు దిల్లీ దర్భారులో గులామ్‌లు. అందువల్ల రాజీలేని పోరాటం చేసిన కేసీఆర్‌ సైనికులను పార్లమెంట్‌కు పంపుదాం’’ అని కేటీఆర్‌ అన్నారు.