దిల్లీ మెడలు వంచేందుకే 16 సీట్లు: కేటీఆర్‌

నిజాంసాగర్‌: ‘‘తెరాసకు 16 సీట్లిస్తే ఏం చేస్తుందని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కేసీఆర్‌. అదే 16 మందిని గెలిపిస్తే దిల్లీ మెడలు వంచుతారు’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిజాంసాగర్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్‌, భాజపా దేశాన్ని 70 ఏళ్లు పాలించాయి. ఇంకా దేశంలో విద్యుత్‌, నీళ్లు, రహదారుల్లేని గ్రామాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ప్రజలు తెలంగాణలో కలుస్తామని చెబుతున్నారు. ముధోల్‌ తాలుకాను ఆనుకోని ఉన్న మహారాష్ట్ర శాసన సభ నియోజక వర్గంలోని 40 గ్రామాల సర్పంచులు తమ ప్రాంతాన్ని ముధోల్‌లో కలపమని తీర్మానం చేశారు. 

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనే కేసీఆర్‌ పూర్వీకులు ఉన్నారు. ఏళ్ల క్రితం అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద పోసాన్‌పల్లి మునిగిపోయింది. ఆ సమయంలో కేసీఆర్‌ పూర్వీకులు పోసాన్‌పల్లి నుంచి సిద్దిపేట జిల్లా చింతమడక తరలివచ్చారు. లేకపోతే కేసీఆర్‌ కామారెడ్డి ఎమ్మెల్యేగానీ, జహీరాబాద్‌ ఎంపీగానీ అయ్యేవారు. మా మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. గోదావరి జలాలను నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టు తీసుకొస్తాం. నిజాం సాగర్‌ ఆయకట్టు కింద రైతులు సంతోషంగా ఉండాలి. వ్యవసాయానికి  24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలనేది ఆయన సంకల్పం. రైతులకు ఎకరానికి 2 పంటలకు పెట్టుబడి సాయం ఇచ్చిన వ్యక్తి కేసీఆర్‌. రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని రూ.10వేలకు పెంచారు. రైతు సంతోషంగా ఉండాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు.