పాదాల ఉబ్బా?

తరచుగా పాదాలు, చేతులు ఉబ్బుతున్నాయా? అయితే తగినంత ప్రోటీన్‌ తీసుకుంటున్నారో లేదో చూసుకోండి. ప్రోటీన్‌ లోపంలో కనబడే ముఖ్యమైన లక్షణాల్లో ఉబ్బు (ఎడీమా) కూడా ఒకటి మరి. రక్తంతో కలిసి ప్రసరించే ప్రోటీన్లు.. ముఖ్యంగా అల్బుమిన్‌ మన కణజాలాల్లో ద్రవాలు పోగుపడకుండా కాపాడుతుంటుంది. అందువల్ల ప్రోటీన్‌ తగ్గిపోతే పాదాల ఉబ్బు తలెత్తే అవకాశముంది. నిజానికి ఎడీమాకు కిడ్నీ వైఫల్యం వంటి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. కాబట్టి ఇతరత్రా తీవ్ర సమస్యలేవీ లేవని నిర్ధరించుకోవటం తప్పనిసరి. ఒకవేళ ప్రోటీన్‌ లోపముంటే వెన్నతీసిన పెరుగు, చికెన్‌, చిక్కుళ్లు, పప్పులు, గుడ్ల వంటివి తీసుకోవటం మంచిది. మనకు రోజుకు అవసరమైన కేలరీల్లో 10% కేలరీలు ప్రోటీన్‌ నుంచి లభించేలా చూసుకోవాలి.