ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం

హైదరాబాద్‌: ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం బయటపడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన నేరస్థుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నేరస్థుడి ఖాతాల్లోని సుమారు రూ.70లక్షలు స్తంభింపజేసినట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ మోసానికి సంబంధించి ఆయన కీలక అంశాలను మీడియాకు వివరించారు. ‘‘ఈ-బిజ్‌ సంస్థను 2001లో నోయిడా కేంద్రంగా స్థాపించారు. ఆ సంస్థ నిర్వాహకులుగా పవన్‌ మలాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. గొలుసుకట్టు మాదిరిగా సభ్యులను చేర్పిస్తే కమీషన్‌ ఇస్తామని చెబుతారు.  తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చని చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఈ సంస్థలో దాదాపు 7లక్షల మంది సభ్యులు ఉన్నట్టు తెలిసింది. నిర్వాహకులు సుమారు రూ.1000 కోట్లు వసూలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి. సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమీషను రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలని నిబంధన పెట్టారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సు అని చెబుతారు. సభ్యులకు కంప్యూటర్‌ కోర్సు,  58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెబుతారు. రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50శాతం మార్కులు వస్తే ధ్రువపత్రం ఇస్తారు. ఈ లెర్నింగ్‌ కోర్సుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదంలేదు. రూ.30వేలతో మరో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామంటారు. ఆదిలాబాద్‌, వరంగల్‌లో ఈ మోసంపై కేసులు నమోదయ్యాయి.  సంస్థ నుంచి మోసపోయిన బాధితులు ఇంకా మా వద్దకు వస్తున్నారు. గతంలో ఇలాంటి మోసానికి పాల్పడిన క్యూనెట్‌ కేసులో 65 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులో అరెస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. నోటీసులు తొలుత ఇచ్చాం. కొందరు స్పందించారు. ఇంకా కొందరికి మరోసారి నోటీసులు ఇచ్చాం’’ అని సజ్జనార్‌ వివరించారు. ఇలాంటి సంస్థల స్కీమ్‌లకు ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.