సైనికులకు సంజీవని

న్యూదిల్లీ: పోరాటాల్లో మరణించే సైనికుల్లో దాదాపు 90శాతం మంది తీవ్రమైన గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించి మరణిస్తారు. ఈ గాయాలకు తక్షణం చికిత్స అందించగలిగితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకోసం డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఓ కిట్‌ను సిద్ధం చేసింది. ప్రాణాలతో పోరాడే సైనికులను కాపాడేలా దీన్ని రూపొందించారు. 
దీనిలో ఉండేవి ఇవే..
తీవ్ర రక్తస్రావం అవుతున్న గాయాలను మూసివేసే ఔషధాలు, గాయానికి డ్రెస్సింగ్‌ చేసే అత్యాధునిక వస్తువులు, ప్రాణాలను నిలిపే సెలైన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి అటవీ, కొండ ప్రాంతాల్లో జరిగే పోరాటాల్లో సైనికులకు అండగా నిలుస్తాయి. పుల్వామా వంటి ఘటన చోటు చేసుకున్న సందర్భంలో ఇటువంటి కిట్‌ ఉంటే మృతుల సంఖ్యను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అత్యవసర కిట్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్స్‌ (ఐఎన్‌ఎంఏఎస్‌) సంస్థ అభివృద్ధి చేసింది. యుద్ధరంగంలో ముఖ్యంగా అధిక రక్తస్రావం, షాక్‌, హైపోవొలెమియా, బాధ కారణంగా మరణిస్తుంటారు. ఈ మెడికల్‌ కిట్‌ యుద్ధరంగంలో సైనికదళాల ప్రాణాలను కాపాడుతుందని ఐఎన్‌ఎంఏఎస్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. 
ప్రాణాలను కాపాడే గ్లైసిరేటెడ్‌ సెలైన్‌..
సాధారణ సెలైన్‌లా కాకుండా గ్లైసిరేటెడ్‌ సెలైన్‌ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇది శరీరంపై గాయం అయినప్పుడు రక్తస్త్రావం పెరగకుండా చేస్తుంది. అంతర్గత రక్త స్త్రావాన్ని కూడా దీని ద్వారా తగ్గించవచ్చు. ఇది వైద్య సిబ్బందికి చికిత్స చేసేందుకు మరింత సమయాన్ని కల్పిస్తుంది. ఈ సమయంలో బాధితుడిని మెరుగైన వైద్యశాలకు తరలించవచ్చు. 
సాధారణ కట్టు కంటే 200 రెట్లు..
ఈ కిట్‌లో ఉన్న కట్టు(డ్రెస్సింగ్‌) సాధారణ దానితో పోలిస్తే దాదాపు 200 రెట్లు అధిక సామర్థ్యం ఉంటుంది. దీనిని ప్రత్యేకమైన సెల్యులోజ్‌ ఫైబర్‌తో తయారు చేశారు. ఇది  రక్తస్రావాన్ని పటిష్టంగా అడ్డుకొని గాయాన్ని ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. రక్తస్రావాన్ని నిరోధిస్తే బాధితుడు షాక్‌కు గురికాకుండా కాపాడవచ్చు. 
రక్తస్రావంపై ఫిల్మ్‌లాగా..
ఈ కిట్‌లోని కైటోసాన్‌ జెల్‌ రక్తస్రావంపై ఒక ఫిల్మ్‌లా ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్తకణాలు  నష్టపోకుండా చూస్తుంది. ఇది యాంటీ బాక్టిరియల్‌ క్రీమ్‌గా కూడా పనిచేస్తుంది. దీంతోపాటు హైపోక్లోరస్‌ యాసిడ్‌ (హెచ్‌వోసీఎల్‌) కూడా ఉంటుంది.

కొన్నాళ్ల క్రితమే యాంటీ న్యూక్లియర్‌ మెడికల్‌ కిట్‌కు  రూపకల్పన..
భారత్‌  ఒక అణ్వాయుధ దేశమై కొన్ని దశాబ్దాలు గడిచింది. కానీ అణుదాడి జరిగితే రక్షించుకోవడానికి అవసరమైన కిట్‌ మాత్రం గత ఏడాది వరకూ భారత్‌ వద్ద లేదు. రష్యా, అమెరికా నుంచి ఈ కిట్లు దిగుమతి చేసుకొంటున్నాం.  కానీ, అవి భారత్‌కు ఆ పరిజ్ఞానం ఇవ్వలేదు. దీంతో మన ఐఎన్‌ఎంఏఎస్‌ స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ న్యూక్లియర్‌ మెడికల్‌ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీని వెనుక ఐఎన్‌ఎంఏఎస్‌ శాస్త్రవేత్తల 20ఏళ్ల కృషి దాగి ఉంది. ఇది సైనికులకే కాదు సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. 
కిట్‌లో ఉండేవి ఇవే..
ఈ యాంటీ న్యూక్లియర్‌ మెడికల్‌ కిట్‌లో దాదాపు 25 వస్తువులు ఉంటాయి. ఇవన్నీ దాదాపు 80 నుంచి 90శాతం రేడియేషన్‌ పీల్చేసుకుంటాయి. రేడియేషన్‌ తగ్గించే టాబ్లెట్లు, పైపూత మందులు ఉన్నాయి.  ప్రూసియన్‌ బ్లూ టాబ్లెట్లు, ఈడీటీఏ , ఊపిరి తీసుకోవడానికి సాయపడే రెస్పిరేటరీ ఫ్లూయిడ్‌, రేడియో యాక్టివ్‌ బ్లడ్‌ మ్యాపింగ్‌ డ్రెస్సింగ్‌, రేడియో యాక్టిక్‌ బయో ఫ్లూయిడ్‌ కలెక్టర్‌, యాంటీ గామా కిరణాల నుంచి రక్షించే పైపూత మందు, యామిఫాస్టిన్‌  ఇంజెక్షన్‌, ఇండ్రానిల్‌ 150 ఎంజీ టాబ్లెట్లు ఉంటాయి.