విమర్శలను పట్టించుకోను: ధావన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కెరీర్‌ అత్యుత్తమ స్కోర్‌ 143 సాధించి తనపై వచ్చిన విమర్శకులకు బ్యాటుతో సమాధానం చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసినా పరాజయం పాలైంది. అయితే దిల్లీలో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ గెలిచే అవకాశముంది.

గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌:
గత కొద్ది నెలలుగా ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గబ్బర్‌ మొహాలీలో శతకం సాధించి తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన ధావన్‌ తనదైన రీతిలో స్పందించాడు. ‘విమర్శలు ఎదురైన సందర్భంలో ప్రశాంతంగా ఉండటమే మంచిది. వాటికి సమాధానమిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను వార్తాపత్రికలను చదవను. బయట నుంచి సమాచారాన్ని తెలుసుకోను. నాకనవసరమైన విషయాలను పట్టించుకోను. నా ప్రపంచంలో నేనుంటా. నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు తెలియదు. అప్పుడు నా ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయో వాటిపైనే నిర్ణయం తీసుకుంటా’ అని వివరించాడు.

విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, చింతించడం మూర్ఖత్వమని, తాను బాధపడినప్పుడు వెంటనే తేరుకొని తన ఆలోచనలు సానుకూల దృక్పథంతో సాగేలా చూసుకుంటానని చెప్పాడు. ప్రశాంతంగా ఉండటానికి ఏం చేస్తారని మీడియా ప్రశ్నించగా అందుకు బదులిస్తూ.. ‘నాతో నేను మాట్లాడుకున్నప్పుడు నాలో ఏర్పడ్డ చెడు ఆలోచనలను అక్కడికక్కడే వదిలేస్తా. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంద’ని పేర్కొన్నాడు. ఏది జరిగినా తాను సానుకూలంగా స్వీకరిస్తానని, మంచైనా చెడైనా ప్రశాంతంగా స్వీకరిస్తానని తెలిపారు. ‘వన్డేల్లో ఐదు వేల పరుగులు చేసిన ఆటగాడికి ప్రధానంగా మూడు అంశాలు కీలకంగా ఉంటాయి.. ఫిట్‌నెస్‌, సానుకూల ఆలోచనలు, డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం.. వీటన్నిటిలో నేను బాగానే ఉన్నా’ అని పేర్కొన్నాడు. 

అనంతరం నాలుగో వన్డేలో రిషబ్‌పంత్‌ చేసిన పొరపాట్లపై స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచాడు. ‘ధోనీకి బదులు జట్టులోకి వచ్చిన రిషబ్‌పంత్‌ వికెట్ల వెనుక విఫలమైన విషయం నిజమే. ఒకవేళ అతడు మంచి ప్రదర్శన చేస్తే ఫలితం మరోలా ఉండేది. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. ధోనీ ఎన్నోఏళ్ళుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడికి అత్యంత అనుభవం ఉంది. రిషబ్‌పంత్‌కు సమయమివ్వాలి. ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదు’ అని వెనకేసుకొచ్చాడు. గాలిలో తేమ సైతం తమ బౌలర్లకు తమ ఓటమికి మరో కారణమని గబ్బర్‌ వివరించాడు.